గొంతు నొప్పితో బాధపడుతున్నారా..మీ నొప్పి తగ్గించే సింపుల్ చిట్కాలు ఇవే.! 1 y ago
గొంతునొప్పి కి చెక్ పెట్టడానికి మన ఇంట్లో ఉండే కొన్ని వస్తువులు చాలా సహాయపడతాయి. కొన్ని ఇంటి చిట్కాలతో నొప్పిని సులభంగా తగ్గించుకోవచ్చు. గొంతు నొప్పి ఉపశమనానికి తేనే, ఉప్పు నీళ్లు, ఛామంతి టీ, యాపిల్ సైడర్ వెనిగర్, వెల్లుల్లి, మిరియాల లాంటివి చాలా ఉపయోగపడతాయి.
తేనె
గొంతు నొప్పిని తగ్గించడంలో తేనె అద్భుతంగా పనిచేస్తుంది. దీని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మరియు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు నొప్పిని తగ్గించడంలో మేలు చేస్తాయి. ఒక చెంచా అల్లం రసం మరియు ఒక చెంచా తేనె కలిపి తీసుకుంటే, నొప్పి త్వరగా తగ్గుతుంది. తేనె శ్వాసనాళాలలో ఉన్న శ్లేష్మాన్ని కూడా కరిగిస్తుంది.
ఉప్పు నీళ్లు
గోరువెచ్చని నీటిలో ఉప్పు వేసి పుక్కిలిస్తే, శ్లేష్మం విచ్ఛిన్నమవుతుంది. ఇది గొంతులోని బ్యాక్టీరియాను చంపి, మంటను తగ్గిస్తుంది. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో అర టీస్పూన్ ఉప్పు వేసి ఆనీళ్ళతో నోరు పుక్కిలిస్తే, గొంతు క్లీన్ అవుతుంది. ఆలా రోజుకు రెండు సార్లు చేయాలి. రాళ్ల ఉప్పు వాడితే మరింత ప్రయోజనం ఉంటుంది.
చామంతి టీ
చామంతిలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మరియు యాంటీ ఆక్సిడెంట్ గుణాలు బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్లను ఎదుర్కొంటాయి. గొంతు నొప్పితో బాధపడేవారికి, ప్రతి రోజూ రెండు కప్పుల చామంతి టీ తాగటం వల్ల ఎంతో ఫలితం ఇస్తుంది. ఇది మీ రోగనిరోధక వ్యవస్థను బలపరచి, వైరస్‌లతో పోరాడటానికీ సహాయపడుతుంది. వేడి నీళ్లలో చామంతి ఆకులు వేసి ఆవిరి పీల్చడం ద్వారా కూడా గొంతు నొప్పి మరియు జలుబు లక్షణాలను తగ్గించుకోవచ్చు.
యాపిల్ సైడర్ వెనిగర్
యాపిల్ సైడర్ వెనిగర్‌లో యాంటీ ఆక్సిడెంట్లు మరియు యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉన్నాయి, ఇవి వైరస్ మరియు బ్యాక్టీరియాలపై ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఇది గొంతు నుంచి శ్లేష్మాన్ని తొలగించడానికి సహాయపడుతుంది. యాసిడ్ గుణాలు బ్యాక్టీరియా వ్యాప్తిని తగ్గిస్తాయని తెలుసుకోండి. ఒక కప్పు నీటికి 1 నుండి 2 టీస్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్ మిక్స్ చేసి, గంటకు ఒకసారి పుక్కిలిస్తే గొంతు నొప్పి సులభంగా తగ్గుతుంది.
వెల్లుల్లి
వెల్లుల్లిలో యాంటీ మైక్రోబియల్, యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. దీనిలో అల్లిసిన్ అనే ఆర్గానోసల్ఫర్ కెమికల్ ఉన్నది, ఇది యాంటీ ఇన్ఫెక్టివ్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ లక్షణాలతో నిండి ఉంది. మీరు వెల్లుల్లిని మీ ఆహారంలో చేర్చితే, జలుబు, ఫ్లూ కలిగించే వైరస్‌లను నివారించవచ్చు. ఓ వెల్లుల్లి రెబ్బను బుగ్గలో పెట్టి పదిహేను నిమిషాల పాటు నమలడం ద్వారా గొంతు నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.
మిరియాలు
మిరియాల్లో యాంటీబాక్టీరియల్ గుణాలు అధికంగా ఉంటాయి. మిరియాల్లోని పెప్పరైన్ రోగాలకు కారణమయ్యే క్రిములను లార్వా దశలోనే చంపుతుంది. కప్పు నీటిలో అరచెంచా మిరియాల పొడి వేసి మరిగించి, ఇందులో కొద్దిగా బెల్లం చేర్చిన తర్వాత వేడిగా తాగడం ద్వారా గొంతులో కఫం తగ్గుతుంది.
గమనిక: పైన అందించిన ఈ ఆరోగ్య సమాచారం మరియు సూచనలు మీ అవగాహన కొరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన ఎలాంటి సమస్య ఉన్నా, వైద్యులను సంప్రదించడం ఉత్తమం.
వైరల్ ఫీవర్స్ రాకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు